
వైభవం.. అప్పన్న జమ్మివేట ఉత్సవం
సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జమ్మివేట ఉత్సవం వైభవంగా జరిగింది. కొండదిగువ పూలతోటలో జరగాల్సిన ఈ ఉత్సవాన్ని వర్షం కారణంగా సింహగిరిపైనే అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, షోడషోపచార పూజలు, వేద పారాయణాలు, పంచశూక్త పారాయణాలు జరిపారు. నృసింహమండపంలో ఉన్న శమీ వృక్షం చెంత విశేష పూజలు నిర్వహించారు. చెట్టు నుంచి శమీ దళాలను కోసి, స్వామికి సమర్పించారు. విశేష అర్చన అనంతరం ఆలయ బేడామండపంలో స్వామికి తిరువీధి జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు పెద్దరాజు, పవన్ తదితరులు ఉత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, పూర్వ ఈవో సూర్యకళ ఉత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఈ రమణ, ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

వైభవం.. అప్పన్న జమ్మివేట ఉత్సవం