
‘అండమాన్ చూద్దాం రండి’ పుస్తకావిష్కరణ
మద్దిలపాలెం: అండమాన్ వెళ్లేందుకు గతంలో మాదిరి భయపడాల్సిన పనిలేదని, ఇప్పుడది చాలా మంచి సందర్శన స్థలమని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రజ్ఞశ్రీ డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన అండమాన్ చూద్దాం రండి(యాత్రా కథనం) పుస్తకాన్ని ఏయూలో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రా రచనల ప్రయోజనాలను వివరించారు. తాను పాకిస్థాన్‌పై రాసిన యాత్రా రచనను సభ ముందుంచారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత(పార్వతీపురం) నారంశెట్టి ఉమామహేశ్వరరావు పుస్తక పరామర్శ చేస్తూ, పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడని, పుస్తకాలు నేస్తాలని అభివర్ణించారు. ఈ పుస్తకం చదివిన తరువాత అండమాన్ వెళ్లాలని ఆరాటం కలుగుతోందన్నారు. గౌరవ అతిథి సెంట్రల్ ఎకై ్సజ్ అధికారి నల్లా అపర్ణ మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు అండమాన్‌లో పనిచేస్తున్నారని, ఇలాంటి సమయంలో అండమాన్ చూద్దాం రండి పుస్తకాన్ని సత్యనారాయణ రాయడం ఆనందంగా అన్నారు. రచయిత బండి సత్యనారాయణ స్పందిస్తూ ఈ పుస్తక రచనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు, యార్లగడ్డ అందించిన ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మస్తాన్ రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో తొలి పుస్తకాన్ని దూరదర్శన్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ సి.సుబ్బారావు స్వీకరించారు. మార్టూరు శ్రీనివాసరావు, ఉప్పల అప్పలరాజు, డా.కేవీఎస్ హనుమంతరావు, సీహెచ్ చిన సూర్యనారాయణ, మరడాన సుబ్బారావు, స్వర్ణ శైలజ, పీఎల్‌వీ ప్రసాద్, శీరేల సన్యాసిరావు పాల్గొన్నారు.