
దసరా పండగ వేళ విషాదం
కంచరపాలెం: దసరా పండగ వేళ చిరు వ్యాపారి కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి చిరువ్యాపారి దుర్మణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం జరిగిన సంఘటన వివరాలివి. కంచరపాలెం నేతాజీ కూడలి ఫ్లైఓవర్ వంతెన సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం పక్క రోడ్డులో బత్తిన ఈశ్వరరావు(52) టీ బడ్డీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం కురిసిన కుండపోత వర్షంతో పాటు ఒక్కసారిగా ఈదురు గాలులు రావడంతో టీ దుకాణంపై హైటెన్షన్ వైర్లు తెగి, సర్వీస్ వైర్లపై పడ్డాయి. ఆపై అవి బడ్డీపై వాలాయి. అదే సమయంలో దసరా పురస్కరించుకుని మామిడి కొమ్మలు ఐరన్ బడ్డీకి ఆలంకరణ చేస్తున్న ఈశ్వరరావు విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందారు. అదే సమయంలో బడ్డీ వద్దకు టీ తాగేందుకు వచ్చిన మామిడి తులసీరావు కూడా విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక, విద్యుత్, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పండగ పూట జరిగిన ఈ సంఘటన గాంధీనగర్ ప్రజల్లో విషాదం నింపింది. సీఐ కె.రవికుమార్ నేతృత్వంలో కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జోన్–5 కమిషనర్ రాము, ఏపీఈపీడీసీఎల్ కంచరపాలెం జోన్ ఈఈ బీకే నాయుడు వైర్ల పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు.