
‘ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ వద్ద నిరసన
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ పార్లమెంట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు తెలిపారు. శుక్రవారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నగరంలో ఎంపీను కలిసి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సొంత గనులు ఉంటేనే ప్లాంట్‌కు భవిష్యత్తు ఉంటుందని, గనుల సాధనకు సహకరించాలని విన్నవించారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. ప్లాంట్‌కు గనులు కేటాయించాలని ఆనాడు తమ పార్టీ కేంద్రాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్లాంట్‌ను రక్షిస్తామని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఆక్షేపించారు. నవంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. ఎంపీను కలిసిన వారిలో పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, సీహెచ్ నర్సింగరావు, మంత్రి రాజశేఖర్‌లు ఉన్నారు.