
అప్పన్న జమ్మివేట ఉత్సవం రేపు
సింహాచలం: విజయదశమి పర్వదినం పురస్కరించుకుని గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి జమ్మివేట ఉత్సవం వైభవంగా జరగనుంది. కొండ దిగువన ఉన్న పూలతోటలో ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు విశేష ఏర్పాట్లు చేస్తున్నారు. పూలతోటలోని ప్రధాన మండపానికి, శ్రీకృష్ణ కొలనుకు నూతనంగా రంగులు వేశారు. పారిశుధ్య పనులు నిర్వహించడంతో పాటు, పెద్ద ఎత్తున విద్యుద్దీపాలంకరణ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.
ఉత్సవం జరుగుతుంది ఇలా..
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సింహగిరి నుంచి మెట్ల మార్గంలో పల్లకీలో కొండ దిగువకు తీసుకొస్తారు. కొండదిగువ ఉన్న పూలతోటలోని ప్రధాన మండపంలో స్వామిని అధిష్టింపజేస్తారు. సాయంత్రం పూలతోటలోని శమీ వృక్షం చెంతన శమీ పూజ నిర్వహిస్తారు. అనంతరం ఆ శమీ దళాలను స్వామి చెంతన ఉంచి ప్రత్యేక పూజలు చేసి, జమ్మివేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామిని పుష్కరిణి మండపం వద్దకు తీసుకొచ్చి, అక్కడ ఉండే అశ్వవాహనంపై అధిష్టింపజేస్తారు. అనంతరం అడవివరం గ్రామంలో స్వామికి అశ్వవాహనంపై గ్రామ తిరువీధి నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో స్వామిని తిరిగి కొండపైకి చేరుస్తారు. జమ్మివేట ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సింహగిరిపై స్వామి దర్శనాలు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు లభిస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

అప్పన్న జమ్మివేట ఉత్సవం రేపు