
సీఈటీఏతో అదనపు ప్రయోజనాలు
ఏయూక్యాంపస్: భారత్–యూకేల మధ్య ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)పై విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి(వీఎస్‌ఈజెడ్) ఆధ్వర్యంలో నోవాటెల్ హోటల్‌లో మంగళవారం ఔట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్‌ఈజెడ్ జోనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీనివాస్ ముప్పాల సీఈటీఏ వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. రూల్ ఆఫ్ ఆరిజిన్, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్, సేవల కోసం మార్కెట్ యాక్సెస్, వస్తువులకు సుంకం లేని యాక్సెస్ వంటి కీలక అంశాలను వివరించారు. జాయింట్ డెవలప్‌మెంట్ కమిషనర్ రోషిణి కోరాటి మాట్లాడుతూ ఎగుమతిదారుల్లో అవగాహన పెంచడానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ భారత్–యూకే సీఈటీఏ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎగుమతిదారులకు లభించే ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు. రాయల్‌బరో ఆఫ్ కెన్సింగ్టన్(లండన్) డిప్యూటీ మేయర్ అరీన్ ఉదయ్ ఆరేటి మాట్లాడుతూ భారతీయ ఎగుమతిదారులు వ్యవసాయ, ఆహార శుద్ధి రంగాల్లో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. నూతన ఒప్పందం ఫలితంగా రెండు దేశాలకు మేలు జరుగుతుందని తెలిపారు. వీఎస్‌ఈజెడ్ డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ ఎ.వి.శివ ప్రసాద్‌రెడ్డి ‘భారతీయ ఎగుమతిదారులకు అవకాశాలు’అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రావణ్ షిప్పింగ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.సాంబశివరావు, ఈపీసీఈఎస్ చైర్మన్ శ్రీకాంత్ బడిత తదితరులు తమ ఆలోచనలను పంచుకున్నారు.
కస్టమ్స్ కమిషనర్ శ్రీధర్