
రేపు రావణవధ ఉత్సవం
హరేకృష్ణ వైకుంఠంలో ఏర్పాట్లు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలోని హరేకృష్ణ వైకుంఠం వద్ద గురువారం రావణవధ ఉత్సవం జరగనుంది. విజయదశమి సందర్భంగా హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో 25 అడుగుల ఎత్తుగల రావణుడి బొమ్మను బాణసంచాతో తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస మాట్లాడుతూ త్రేతాయుగంలో విజయదశమి నాడు శ్రీరామచంద్రుడు రావణుడిపై సాధించిన విజయానికి సంకేతంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని.. రెండో ఏడాది ఇక్కడ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ అష్టోత్తర హోమం, శ్రీరామలీలా ప్రవచనం, మహా మంగళ హారతి, రావణవధ, సాంస్కృతిక కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమానికి ముందు జాగ్రత్తగా అగ్నిమాపకశాఖ సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రతినిధి అంబరీష దాస కోరారు.