
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నంబర్–1గా ఏపీ
విశాఖ సిటీ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్–1 స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోందని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ రీజినల్ అవుట్‌రీచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు, పాలసీలను రూపొందించిందని తెలిపారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పరిశ్రమల అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 8 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని, భవిష్యత్తులో విశాఖలో వైట్ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ, స్టీల్ ప్లాంట్‌తో పాటు మరెన్నో యూనిట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. పరిశ్రమల శాఖ అడిషినల్ డైరెక్టర్ రామలింగేశ్వరరాజు మాట్లాడుతూ సింగిల్ డెస్క్ ప్రోగ్రాం ద్వారా 23 విభాగాలకు చెందిన 123 అనుమతులు, లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సులభతరమైన వ్యాపారాల కోసం 2024–25లో 435 సంస్కరణలు చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడాలంటే, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సర్వే కాల్స్/మెసేజ్‌లకు సరైన సమాధానాలు ఇవ్వాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో విశాఖ డీఐసీ జీఎం ఆదిశేషు, పారిశ్రామికవేత్తలు సాంబశివరావు, పాండురంగ ప్రసాద్ పాల్గొన్నారు.