
ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం
మహారాణిపేట: ప్రజల నుంచి అందిన వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్‌లతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారి లేదా సిబ్బంది తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు. రీ ఓపెన్ అవుతున్న అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, తగిన విధంగా ఎండార్స్‌మెంట్ వేసి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 365 వినతులు అందజేశారు. ఇందులో రెవెన్యూ విభాగానికి 121, జీవీఎంసీకి 124, పోలీస్ శాఖకు 26, ఇతర అంశాలకు చెందిన 94 వినతులు ఉన్నాయి.
ముస్లింల అభివృద్ధికి వినతి
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ నూర్ భాషా/దూదేకుల అభ్యున్నతికి చర్యలు చేపట్టాలి. మైనార్టీ నూర్ భాషా జీవన ప్రమాణాలు మేరుగు పడే విధంగా పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలి. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథులు, అవివాహిత మహిళలకు రుణాలు మంజూరు చేయాలి. చికెన్, మేక మాంసం వ్యాపారం చేసే నూర్ భాషా/దూదేకుల సామాజిక వర్గాలకు ఫ్లోర్ వీలర్ మోపెడ్ వాహనాలు ఇవ్వాలి. చేనేత కార్మికులకు, పరుపులు కుట్టే దర్జీలకు, ఇతర చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలి.
–షేక్ బాబ్జీ, సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ, ఉత్తర నియోజకవర్గం
కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్