
వేడుకగా అప్పన్న ఆయుధ పూజ
సింహాచలం: సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జరుగుతున్న విజయదశమి ఉత్సవాల్లో భాగంగా.. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేంచేసి ఉన్న సింహవల్లీ తాయారు సన్నిధిలో ఈ పూజలను పండితులు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆయుధాలైన గద, ధనస్సు, బాణం, కత్తి, పరశురామ గొడ్డలి, ఖైజార్ తదితరాలను పూజ కోసం ఉంచారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆయుధ దేవత ఆవాహనం, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయుధాలకు విశేషంగా హారతులిచ్చారు. అనంతరం పూజలో ఉంచిన ఆయుధాలను సింహవల్లీ తాయారుకి అలంకరించారు. ఆలయ స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు సాతులూరి నరసింహాచార్యులు తదితరులు ఈ పూజను నిర్వహించారు. విజయదశమి వరకు ఆయుధాలను సింహవల్లీ తాయారు సన్నిధిలోనే ఉంచి, ప్రతి రోజూ విశేషంగా ఆరాధన నిర్వహిస్తారు. అలాగే స్వామి సన్నిధిలో శ్రీరామ నవరాత్ర పారాయణం పఠించారు. ఆలయ సూపరింటిండెంట్ సత్య శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.