
ఆరు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
బషీరాబాద్: కారు మబ్బులతో మేఘం ఘర్జించింది. ఆదివారం తెల్లవారుజామున భీకర ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జనాన్ని వణికించింది. ఉదయం 3 గంటలకు ప్రారంభమైన జడివాన మధ్యాహ్నం 12 గంటల వరకు దంచి కొట్టింది. ఏడు సెంటీమీటర్ల పైన కురిసిన భారీ వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు మత్తడి దూకాయి. కాగ్నానది, జుంటివాగు, ఎక్మాయి వాగు, వంకలు పొంగిపొర్లాయి. మండల కేంద్రంలోని టాకీతండా దగ్గర కాల్వ కల్వర్టుపై నుంచి పొంగి పొర్లడంతో, బషీరాబాద్ నుంచి మంతన్‌గౌడ్ తండా, మంతన్ గౌడ్, ఎక్మాయి, మైల్వార్, కంసాన్‌పల్లితో పాటు కర్ణాటకకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగ్నానది వరదకు మరోసారి పంటలు నీట మునిగాయి. బషీరాబాద్‌లో ఓ పాడుపడిన ఇళ్లు పాక్షికంగా కూలింది.