
సన్నాలకు బోనస్ సున్నా
పరిగి: వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా రైతులు సన్నాల సాగు చేపట్టారు. వీటిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ధాన్యం కొనుగోలు చేసి ఐదు నెలలు కావస్తున్న బోనస్ డబ్బులు మాత్రం నేటికీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 8 వేల మెట్రిక్ టన్నుల సన్నాలు సేకరించగా ఇందుకు సంబంధించి దాదాపు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. బోనస్ ఎప్పుడు పడుతుందోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు..
మే మొదటి వారంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. సన్న రకం విక్రయించిన రైతులకు ముందుగా క్వింటాల్‌కు రూ.2,320 చెల్లించి తరువాత బోనస్ వేస్తామని ప్రకటించింది. ధాన్యం అసలు ధర రైతుల ఖాతాల్లో వెంటనే జమచేసినా బోనస్ మాత్రం వేయలేదు. ఒక్కో రైతుకు లక్ష వరకు రావాల్సి ఉంది. వానాకాలం ధాన్యం విక్రయాల సమయమొచ్చినా నేటికీ బోనన్ చెల్లించకపోవడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదు నెలలు గడుస్తున్నా అందని ప్రభుత్వ ప్రోత్సాహకం
8 వేల మెట్రిక్ టన్నులకు గాను రూ.4 కోట్ల బకాయి
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు