
ప్రాదేశిక పోరు.. ఎవరిదో జోరు!
దౌల్తాబాద్: పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. మండలంలో తొలివిడతలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సమాయత్తమవుతుండగా ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. గత ప్రాదేశిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కై వసం చేసుకుంది. 15 ఎంపీటీసీ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ గెలుపొందగా.. 14 స్థానాల్లో కారు జోరు చూపింది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో మండల పరిధిలో అన్ని స్థానాలు హస్తగతం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు వ్యూహం రచిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వివరించాలంటూ సీనియర్ నాయకులు సూచిస్తున్నారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వ్యూహం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఆశావహుల్లో ఉత్కంఠ
ఎన్నికల సంఘం స్థానికల సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలచేయడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీల తరపున ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై నేతలు మంతనాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు మారడంతో ఈ సారి కొత్త ముఖాలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
పార్టీ గుర్తుపై పోటీకి..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ గుర్తులతోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి బరిలో నిలిచేందుకు పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గెలుపు ధీమాతో ఉన్న నాయకులు పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి తిరుపతిరెడ్డి, నరేందర్‌రెడ్డి సూచించిన వ్యక్తులకే టికెట్ ఇవ్వనున్నారు.
బరిలో మాజీలు..?
గత సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోసారి తమ జాతకం పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా గ్రామ స్థాయి నుంచి నాయకులు కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. జనరల్ స్థానాల్లో తీవ్ర పోటీ ఉంది.
గత ఎన్నికల్లో సత్తాచాటిన ‘కారు’
జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు బీఆర్‌ఎస్ ఖాతాలోకే..
హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్న కాంగ్రెస్