
మూసీలోకి భారీ వరద
సాక్షి, సిటీబ్యూరో/మణికొండ: మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల 10 గేట్లు 3 అడుగుల చొప్పున ఎత్తి దిగువకు సుమారు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లకు ప్రవాహం పెరిగింది. ఇప్పటికే రెండు రిజర్వాయర్ల పూర్తిస్థాయి నీటి మట్టం వరకు నీరు చేరడంతో ఆదివారం ఎగువ నుంచి వచ్చిన వరదను దిగువకు విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట) 8 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి మూసీ నదికి 2,704 క్యూసెక్కుల వరద నీటిని వదిలారు. దీంతో నార్సింగి, హైదర్షాకోట్, మంచిరేవుల నుంచి మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్‌కు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో రెండు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1,981 క్యూసెక్కుల నీటిని ఈసీ నదికి వదిలారు. లంగర్‌హౌస్‌లో మూసీ నదిలో కలవటంతో అక్కడి నుంచి మరింత ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. గండిపేట నుంచి 8 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో నార్సింగి మున్సిపల్ కేంద్రం నుంచి మంచిరేవులకు, ఔటర్ ఓ వైపు సర్వీసు రోడ్ల మీదుగా నీరు పారడంతో రాకపోకలను నిలిపివేశారు. పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే వరదను బట్టి మరిన్ని గేట్లను తెరవటం, మూయటం చేస్తామని మూసీ నది పరీవాహకంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి, రెవెన్యూ, పోలీసు అధికారులు సూచించారు. జలాశయాల నీటి విడుదలతో స్థానికులు కొందరు గాలాలతో చేపలు పడుతూ కనిపించారు.
జంట జలాశయాల పది గేట్లు ఎత్తివేత