
పత్తి సేకరణకు సన్నద్ధం
జిల్లాలో పత్తి రైతులు 1,25,000 మంది సాగు చేసింది 2,46,725 ఎకరాల్లో.. ఉత్పత్తి అంచనా 2,68,282 మెట్రిక్ టన్నులు 14 కేంద్రాలు ఏర్పాటు
నవంబర్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం
వికారాబాద్: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో ప్రక్రియ చేపట్టనుండగా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ పర్యవేక్షిస్తారు. వానలు తగ్గుముఖం పట్టి ఎండలు ప్రారంభమైతే మరో నెల రోజుల్లో పత్తి తీసే పనులు ప్రారంభిస్తారు. ఎంత మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 5లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగువుతుండగా ఎక్కువ భాగం పత్తి వేశారు. 1,25,000 మంది రైతులు 2,46,725 ఎకరాల్లో పంట వేశారు. ఈ లెక్కన ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల చొప్పున దాదాపు 2,68,282 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. బాత్‌రూంలు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ కోసం స్థలం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. కాటన్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసే వేయింగ్ మిషన్లు తూనికల కొలతల శాఖ అధికారులు పరిశీలించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు.
ఈ సారైనా ఇబ్బందులు తప్పేనా?
ఐదారు సంవత్సరాలుగా పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ సారైనా సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని పత్తి రైతులు కోరుతున్నారు. ఏటా వికారాబాద్, పరిగి వ్యవసాయ డివిజన్లలో పత్తి అత్యధికంగా సాగు చేస్తున్నా అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. తక్కువ సాగయ్యే తాండూరు ప్రాంతంలో మాత్రం ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పరిగి, పూడూరు మండలాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మూడు కొనుగోలు కేంద్రాల్లోనే పరిగి, వికారాబాద్ వ్యవసాయ డివిజన్లకు చెందిన రైతులు పత్తి విక్రయిస్తుండటంతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో రైతులు వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ బాధలు భరించలేక పలువురు దళారులను ఆశ్రయిస్తున్నారు.
అంచనాలు తలకిందులయ్యే అవకాశం
మరో నెల రోజుల్లో పత్తి దిగుబడి మార్కెట్‌లోకి రానుంది. గత రెండు సీజన్లలో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు ఉండటంతో కొనుగోలు కేంద్రాలకు పత్తి అంతంత మాత్రంగానే వచ్చింది. ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఓపెన్ మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో కొనుగోలు కేంద్రాలకు భారీగా వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం క్వింటాలు ఏ గ్రేడ్ పత్తికి రూ.8,110, సాధారణ రకానికి రూ.7,710 మద్దతు ధర నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు రూ.7వేల నుంచి రూ.7,500 వరకు ధర పలుకుతోంది. సీజన్ ప్రారంభమయ్యేనాటికి ఈ ధరలు మరిం పడిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు అవకాశం ఉంది. అధికారుల అంచనాలు కూడా తారుమారు కావచ్చు. అధిక వర్షాల కారణంగా ఈ సారి దిగుబడి తగ్గేలా ఉందని రైతులు అంటున్నారు.
ఏర్పాట్లు చేస్తున్నాం
జిల్లాలో పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సదుపాయాలు కల్పించాలని ఆదేశించాం. 14 కేంద్రాలను ఏర్పాటు చేశాం. తూకాల్లో మోసాలకు అవకాశం లేకుండా చూస్తాం. రైతులు కూడా కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలి.
– లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్

పత్తి సేకరణకు సన్నద్ధం