సానుభూతికి నో ఛాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

సానుభూతికి నో ఛాన్స్‌

Oct 5 2025 12:14 PM | Updated on Oct 5 2025 12:14 PM

సానుభూతికి నో ఛాన్స్‌

సానుభూతికి నో ఛాన్స్‌

తిరుమలగిరి (తుంగతుర్తి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

గతానికి భిన్నంగా ..

గతంలో ముందుగా ఒక నోటిఫికేషన్‌ జారీ అయ్యేది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు లేదా సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలో ఏదో ఒకటి ముందు జరిగేది. ఇలా జరగడం వల్ల ముందుగా వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి దరిదాపుల్లోకి వచ్చి ఓడి పోయిన వారు మరోసారి వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈసారి సానుభూతికి ఛాన్స్‌ లేకుండానే నేరుగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు సానుభూతిని మూటగట్టుకునే ఛాన్స్‌ లేకుండా పోయింది. రెండు ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరిశీలించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. రెండింటికీ పోటీ చేస్తే నెగెటివ్‌ ఫలితాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మొదటి ఎన్నికల్లో ఓడి రెండో ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఈసారి లేవు. గతంలో చాలా మంది అభ్యర్థులు సర్పంచ్‌ పదవికి ఓడిపోయి మళ్లీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారు. ముందుగా ఎంపీటీసీగా ఓడిపోయి తరువాత సర్పంచ్‌గా గెలిచిన సంఘటనలు ఉన్నాయి. ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.

పార్టీ నేతలకు తలపోట్లు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుండగా సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు ఎంపీటీసీ, సర్పంచ్‌ అభ్యర్థులను ఆయా పార్టీల నేతలు ఎంపిక చేయాల్సి వస్తుంది. రెండు వేర్వేరుగా నోటిఫికేషన్లు వస్తే ఆయా పార్టీలకు కొంత సమయం దొరికి అభ్యర్థుల ఎంపిక సులభంగా ఉండేది. కానీ ఏక కాలంలో ఎన్నికలు రావడంతో ఒక్కో ఊరిలో ఎంపీటీసీ అభ్యర్థిని, సర్పంచ్‌ అభ్యర్థిని, మండల స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిని మళ్లీ గ్రామ స్థాయిలో వార్డు సభ్యులను ప్యానల్‌గా నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని పార్టీలకు ఇప్పుడు ఈజమిలి నోటిఫికేషన్‌ తలనొప్పిగా మారింది.

రెండు విడతల్లో ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలు

జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్దం చేశారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్‌ 11న నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కాగా అక్టోబర్‌ 23న ఎన్నికలు జరుగనున్నాయి. రెండవ విడత ఎన్నికలకు అక్టోబర్‌ 15న నామినేషన్లకు చివరి రోజు, 27న రెండవ విడతకు నామినేషన్లు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 11న వెలువడతాయి. ఎన్నికలు జరిగిన తరువాత ఫలితాల కోసం పక్షం రోజులు నిరీక్షించాల్సి వస్తుంది. అదే సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబర్‌ 31న, నవంబర్‌ 4న రెండు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. మొత్తంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేస్తూ ఎన్నికల కోడ్‌ను అమలులోకి తెచ్చింది.

ఫ ‘స్థానికం’లో ఒకేసారి ఎన్నికలు

ఫ వరుసగా ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలు

ఫ ఓడి గెలిచేందుకు అవకాశం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement