కాంగ్రెస్‌ కసరత్తు! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ కసరత్తు!

Oct 4 2025 6:42 AM | Updated on Oct 4 2025 6:42 AM

కాంగ్రెస్‌ కసరత్తు!

కాంగ్రెస్‌ కసరత్తు!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎంపికపై నేతలు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎవరన్న ఉత్కంత నెలకొంది. జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అభ్యర్థులను ఎవరన్న దానిపై ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాలను రూపొందించి ఈనెల 6వ తేదీ నాటికి పంపాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌, జిల్లాకు చెందిన మంత్రులు, సీనియర్‌, ముఖ్య నేతలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సాధించారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్‌ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా, సూర్యాపేట చైర్మన్‌ పదవి బీసీకి, యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు అయిన సంగతి తెలిసిందే. ఈనెల 9వ తేదీన మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అయితే జెడ్పీ చైర్మన్‌ పదవి ఆశించే నేతలు సులభంగా గెలిచే జెడ్పీటీసీ స్థానాలపై దృష్టి సారించారు.

ఎన్నికల మూడ్‌లోకి కాంగ్రెస్‌ శ్రేణులు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగింది. ఆశావహులు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసారు. పోటీ చేయాలనుకునే వారంతా తమ గాడ్‌ ఫాదర్‌లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియను చేపట్టేందుకు ఆయా పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి.

జెడ్పీ పీఠం దక్కేదెవరికో..?

● నల్లగొండ జెడ్పీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో ఈసారి చైర్మన్‌ ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 33 జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీ మహిళలకు పెద్దవూర, డిండి స్థానాలు రిజర్వు కాగా, దేవరకొండ, పీఏపల్లి, కొండమల్లేపల్లి స్థానాలు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి. ఈ అయిదు స్థానాలతో పాటు జనరల్‌, జనరల్‌ మహిళలకు కేటాయించిన స్థానాల్లోనూ ఎస్టీ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. అందులో అడవిదేవులపల్లి, నేరేడుగొమ్ము, చందంపేట, దామరచర్ల, తిరుమలగిరిసాగర్‌ స్థానాల్లో ఎస్టీ మహిళలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో దివంగత మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ సతీమణి మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్‌ పేరును కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె వద్దంటే ఆమె కుమారుడు స్కైలాబ్‌నాయక్‌ సతీమణిని బరిలో దింపుతారన్న చర్చ జరుగుతోంది. ఆమె ప్రభుత్వ అధికారి అయినందున పోటీ కి ఆసక్తి చూపుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

● సూర్యాపేట జిల్లా జెడ్పీ పీఠం బీసీలకు రిజర్వు కావడంతో అక్కడ అధికార పార్టీ అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది. ఆశావహులు ప్రయత్నాలు మొదలు పెట్టినా మంత్రులు ఇంకా దృష్టి సారించలేదు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియల తరువాత దీనిపై అధికార కాంగ్రెస్‌ పార్టీ చర్చించనుంది. అయితే బీసీలకు రిజర్వు చేసిన గరిడేపల్లి, కోదాడ, నడిగూడెం, పెన్‌పహాడ్‌, నాగా రం, బీసీ మహిళలకు కేటాయించిన ఆత్మకూరు(ఎస్‌), చింతలపాలెం, మేళ్లచెరువు, నేరేడుచర్ల, సూర్యాపేట, జనరల్‌ మహిళలకు కేటాయించిన అర్వపల్లి, మఠంపల్లి, జనరల్‌ స్థానాలైన చిలు కూరు, చివ్వెంల, పాలకీడు స్థానాల్లో పోటీచేసి గెలిచే బీసీ నాయకులకు చైర్మన్‌ పదవి దక్కనుంది.

● యాదాద్రి–భువనగిరి జిల్లా పరిషత్‌ స్థానం బీసీ మహిళలకు కేటాయించారు. దీంతో ఇక్కడ బీసీలకు కేటాయించిన జెడ్పీటీసీ స్థానాలతో పాటు జనరల్‌, జనరల్‌ మహిళలకు కేటాయించిన స్థానాల్లో బీసీ మహిళలు ఎవరైనా పోటీ చేసి గెలు పొందితే వారిలో ఒకరికి జెడ్పీ చైర్‌పర్సన్‌ అయ్యేందుకు అవకాశం దక్కనుంది. బీసీ మహిళలకు కేటాయించిన ఆలేరు, ఆత్మకూరు (ఎం), చౌటుప్పల్‌తో పాటు బీసీలకు కేటాయించిన అడ్డగూడూరు, భూదాన్‌పోచంపల్లి, గుండాల వలిగొండ జడ్పీటీసీ స్థానాలతో పాటుగా, జనరల్‌ మహిళలకు కేటాయించిన భువనగిరి, మోటకొండూరు, తుర్కపల్లి, జనరల్‌ అయిన బీబీనగర్‌, సంస్థాన్‌ నారాయణపురం, యాదగిరిగుట్ట జెడ్పీటీసీ స్థానాల్లోనూ బీసీ మహిళలు పోటీచేసే అవకాశముంది.

ఫ జెడ్పీటీసీ సభ్యులు, చైర్మన్‌ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతల దృష్టి

ఫ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిలో జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థుల కోసం అన్వేషణ

ఫ నల్లగొండలో ఎస్టీ మహిళ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ

ఫ పోటీచేసే యోచనలో రాగ్యానాయక్‌ సతీమణి లేదంటే కోడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement