
పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్లు
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్లు ఉంచాలని విద్యా శాఖ నిర్ణయించింది. ప్రతినెలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.. సెలవులు, పరీక్షలు ఎప్పుడు ఉంటాయో.. ఉపాధ్యాయులుకు తప్ప విద్యార్థులకు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఒక విద్యాసంవత్సరంలో ఏ నెలలో ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారో అన్ని వివరాలు తెలిసేలా అకడమిక్ క్యాలెండర్లు ముద్రించి అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఎన్‌సీఈఆర్‌టీ దీన్ని రూపొందించింది. ప్రతి పాఠశాల, ఎమ్మార్సీలో ఒక్కోటి, డీఈఓ, కలెక్టర్ కార్యాలయాల్లో రెండు చొప్పున ఉంచాలని ఆదేశించింది. జిల్లాకు కావాల్సిన 882 క్యాలెండర్లను ఇప్పటికే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు పంపించారు. వీటిని శనివారం (4వ తేదీ) నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.
క్యాలెండర్‌లో పొందుపర్చిన అంశాలివే..
వార్షిక షెడ్యూల్‌లో బడిబాట, పాఠశాల పున:ప్రారంభం, దసరా, క్రిస్మస్ సెలవుల వివరాలు ఉన్నాయి. అలాగే పరీక్షల షెడ్యూల్‌లో ఎఫ్‌ఏ–1 నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షల వరకు ఏయే తేదీల్లో నిర్వహించాలో పొందుపరిచారు. స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్, 1–10వ తరగతి వరకు సిలబస్ ఎప్పుడు పూర్తి చేయాలి, రివిజన్ తరగతుల నిర్వహణ వంటి వివరాలు ఉన్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పనిచేసే సమయాలను పొందుపరిచారు. ప్రతి నెలలో నిర్వహించే కార్యక్రమాలు, సముదాయ సమావేశాలు, పాఠశాల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీల వివరాలు, సైన్స్ ఎగ్జిబిషన్లు, ఇన్‌స్పైర్ అవార్డులు, సెమినార్లు వంటి వివరాలున్నాయి. జూన్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతినెలా పాఠశాల పనిదినాలు ఎన్ని ఉంటాయి.. పీటీఎం సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో అందులో ఉంది. కోకరిక్యులర్ యాక్టివిటీలో ఆరోగ్యం, కంప్యూటర్, కళలు, సంస్కృతి, విలువలు, జీవన నైపుణ్యాలపై వారంలో ఎన్ని పీరియడ్లు తీసుకోవాలో పొందుపరిచారు.
ఫ విద్యా కార్యక్రమాలు, సెలవుల
సమాచారంతో రూపకల్పన
ఫ ఏ కార్యక్రమం ఎప్పుడు
నిర్వహించాలో తెలిసేలా ముద్రణ
ఫ జిల్లాకు 882 క్యాలెండర్లు
కేటాయింపు
ఫ ఇప్పటికే ఎమ్మార్సీలకు
చేర్చిన విద్యా శాఖ
ఫ నేటి నుంచి పాఠశాలలకు పంపిణీ