
మోగిన స్థానిక నగారా
ఎన్నికల నిర్వహణ పనుల్లో..
భానుపురి (సూర్యాపేట) : పల్లె పోరుకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. రెండు విడతల్లో జిల్లాలో ఉన్న 23 మండలాల్లోని 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలు, 486 గ్రామ పంచాయతీలు, 4,388 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ప్రకటనతో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ప్రకటించారు. జిల్లా యంత్రాంగం చకాచకా ఎన్నికల పనులు మొదలు పెట్టింది. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా.. నవంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ముగియనుంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు..
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ రానుంది. సూర్యాపేట, తుంగతుర్తి డివిజన్ల పరిధిలోని 11 మండలాల్లోని 11 జెడ్పీటీసీ, 112 ఎంపీటీసీ స్థానాలకు అదేనెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. దీనికోసం 550 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. రెండో విడతలో కోదాడ, హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్లలోని 12 మండలాల్లో 12 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్, 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ రెండు విడతల్లో పోలైన ఓట్లను నవంబర్ 11న లెక్కించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. దీనికోసం 722 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
సర్పంచ్ స్థానాలకు..
సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు రెవెన్యూ డివిజన్ల వారీగా జరగనున్నాయి. మొదట సూర్యాపేట, తుంగతుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 249 గ్రామపంచాయతీలు, 2,218 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక్కడ 2,218 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా 2,32,962 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరో విడతలో కోదాడ, హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 237 గ్రామపంచాయతీలు, 2,170 వార్డుల కోసం జరిగే ఎన్నికలకు అధికారులు 2185 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విడతలో దాదాపు 3,61,853 మంది ఓటు వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్, వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా సూర్యాపేట జిల్లాలో మాత్రం రెండు విడతల్లో పూర్తి చేయనున్నారు. ఈ ఎన్నికలు ఏయే విడతల్లో నిర్వహించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. మరుసటి రోజు వార్డు సభ్యుల్లో నుంచి ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటారు.
మండలాలు 23
జెడ్పీటీసీ స్థానాలు 23
ఎంపీటీసీ స్థానాలు 235
పోలింగ్ స్టేషన్లు 1,272
గ్రామపంచాయతీలు 486
వార్డులు 4,388
పోలింగ్ స్టేషన్లు 4,403
మొత్తం ఓటర్లు 6,94,815
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఫ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు
ఫ అమలులోకి ఎన్నికల కోడ్.. ఎన్నికల నిర్వహణ పనుల్లో యంత్రాంగం బిజీ
ఫ జిల్లా వ్యాప్తంగా 23 మండలాలు, 486 గ్రామపంచాయతీలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
విడత పోలింగ్ తేదీ డివిజన్లు స్థానాలు
మొదటి అక్టోబర్ 23 సూర్యాపేట, తుంగతుర్తి 11 జెడ్పీటీసీలు, 112 ఎంపీటీసీలు
రెండో అక్టోబర్ 27 కోదాడ, హుజూర్‌నగర్ 12 జెడ్పీటీసీలు, 123 ఎంపీటీసీలు
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం ఆ పనుల్లో నిమగ్నమైంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో ప్రారంభించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల సంఘం ఆదేశాలనే పాటించాలని సూచించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి 15 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. ఇక ఎన్నికల నిర్వహణలో కీలకమైన ప్రొసీడింగ్ అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు.