
‘ఉపాధి’లో బోగస్ హాజరుకు చెక్
చిలుకూరు: ఉపాధిహామీ పథకం కింద పనులు చేసే కూలీల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా నూతనంగా ఉపాధి కూలీల ముఖగుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్) విధానానికి శ్రీకారం చుట్టింది. ఒకరి పేరిట మరొకరు పనులకు వెళ్లటం లాంటి వాటికి చెక్ పడనుంది. నూతన విధానాన్ని అమలు చేసేందుకు జిల్లాలో మూడు రోజులుగా ఉపాధిహామీ కూలీల ముఖ చిత్రం, ఇతర వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్‌లు) ఆన్‌లైన్‌లో కూలీల ఫేస్ ఐడీ నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షకుపైగా కూలీల కార్డులకు సంబంధించి ముఖ చిత్రాల సేకరణ నమోదును పూర్తిచేశారు. సూర్యాపేట మండలంలో 2,600 మంది వివ రాలు సేకరించి ముందుండగా చింతలపాలెం మండలంలో కేవలం 50 మంది వరకే సేకరించారు.
అక్రమాలు జరగకుండా..
ఉపాధి పనుల విషయంలో గతంలో చనిపోయిన వారి పేరిట జాబ్‌కార్డు ఉంటే వారిపేరు మీద కుటుంబ సభ్యులు పనులకు వెళ్లేవారు. అలాగే 100 రోజుల పనిదినాలు పూర్తిచేసిన వారు ఇతరుల కార్డులతో పనిచేయడం వల్ల అక్రమాలు చోటుచేసుకునేవి. అయితే ఇకనుంచి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త విధానంతెచ్చింది.
కొత్త విధానం అమలైతే..
కొత్తగా తెచ్చిన ముఖగుర్తింపు హాజరు విధానం అమలైతే అక్రమాలకు చెక్ పడనుంది. ఈ విధానం వల్ల ఆన్‌లైన్‌లోనే హాజరు నమోదు కానుంది. ఎవరూ పనులకు వస్తే వారి పేరిట మాత్రమే హాజరు నమోదు కానుంది. ఒక జాబ్‌కార్డులో నలుగురు కూలీలు ఉంటే పనికి వచ్చిన వారి పేరిటే హాజరు నమోదుతో పాటు వేతనం కూడా వారి ఖాతాలోనే జమవుతుంది. చెల్లింపులు సైతం త్వరితగతిన పూర్తవుతాయి.
మండలాలు 23
గ్రామాలు 475
జాబ్‌కార్డులు 2,63,000
కూలీల సంఖ్య 5,60,275
పనులకు వెళ్తున్నవారు 3,34,539
ముఖగుర్తింపు హాజరు విధానానికి శ్రీకారం
ఫ ఆన్‌లైన్‌లో కూలీల వివరాలు
నిక్షిప్తం చేస్తున్న అధికారులు
ఫ ఇప్పటికే నమోదైన లక్షమంది కూలీలు
ఫ వచ్చే నెలలో పూర్తికానున్న ప్రక్రియ