
పేట మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు
భానుపురి (సూర్యాపేట) : సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈనెల 29 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఫసీయుద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగ ఉండడంతో వ్యాపారులు, కార్మికుల కోరిక మేరకు సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. అలాగే దుర్గాష్టమి, దసరా పండుగల నేపథ్యంలో వచ్చేనెల 3వ తేదీ వరకు మార్కెట్ యార్డు, కార్యాలయానికి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి రైతులు సెలువు దినాల్లో యార్డుకు ధాన్యం, ఇతర ఉత్పత్తులను తీసుకురావొద్దని కోరారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహుని నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవంతోపాటు నిత్యకల్యాణం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మహానివేదనగావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి క్షేత్రంలో ఆదివారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలు అర్పించి సహస్రనామార్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్తోత్తర పూజలు గావించారు. రాత్రి స్వామి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.

పేట మార్కెట్‌కు ఐదు రోజులు సెలవు