
22 నెలలైనా గ్యారంటీల జాడేలేదు
చివ్వెంల(సూర్యాపేట) : ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడేలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీల బాకీ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. గ్యారంటీలు ఇవ్వడమే కాదు.. అవి రాకపోతే మాకు గుర్తు చేయమని అనాడే కాంగ్రెస్ నాయకులు చెప్పారని, అందుకే ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో గుర్తుచేయడాలనికి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసి రూ.20వేల కోట్లని చెబుతున్నారని విమర్శించారు. రైతు భరోసా కింద ఒక్కో ఎకరాకు రూ.19వేలు, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పి ఒకొక్కరికి రూ.55వేలు, ఆసరా పెన్షన్ల కింద ఒక్కొక్కరికి రూ.44వేలు, ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి రూ.22వేలు బాకీ ఉన్నారన్నారు. నిరుద్యోగులకు 50వేల ఉద్యోగాలు అని చెప్పి 5వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు రూ.24వేలు బాకీ ఉన్నారన్నారు. ఇచ్చిన ఒక్క గ్రూప్–1 నోటిఫికేషన్లో కూడా మొత్తం పైరవీలు చేసి కోట్ల రూపాయలు తీసుకుని ఆంధ్రోళ్లకు ఇచ్చారని ఆరోపించారు. ఆడపిల్లలకు స్కూటీలు, విద్యార్థులకు భద్రత కార్డులు ఇవ్వలేదన్నారు. ఈ హామీలు కేవలం సీఎం రేవంత్‌రెడ్డి మాత్రమే ఇచ్చినవి కావని.. ఏఐసీసీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ఇచ్చినవే అని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులనే కాదు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. వీటన్నింటిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చిన్న చిన్న లీడర్లు ఫోన్ చేసినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. యూరియా కోసం లైన్‌లో నిలబడి మహిళలు చనిపోతే కనీసం కాంగ్రెస్ నాయకులు పరామర్శించలేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు ఇంటి ముందుకు వస్తే బాకీ కార్డు చూపించి నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి ఆకుల లవకుశ, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహరావు, ధరావతు బాబునాయక్, గుర్రం సత్యనారాయణరెడ్డి, శ్రీరాములు, మాజీ సర్పంచ్ పల్లేటి శైలజనాగయ్య, నాగార్జున పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి