
లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
సూర్యాపేట : కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్‌లో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు కలెక్టర్ హాజరై లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతగానో పోరాడారని కొనియాడారు. అదనపు కలెక్టర్ కె.సీతారామారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు లక్ష్మణ్ బాపూజీ అన్నారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉషశ్రీ, రూప, స్వస్తిక్‌లకు ఉపకార వేతనాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహారావు, మాజీ మున్సిపల్ కమిషన్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు చల్లమల్ల నరసింహ, రామప్రభు, శారదాదేవి, పద్మశాలి నాయకులు అప్పం శ్రీనివాస్, పెండెం కృష్ణ, బంటు కృష్ణ, బయ్య మల్లికార్జున యాదవ్, వెంకటేశ్వర్లు, నగేష్, సైదులు, తల్లమల హుస్సేన్, యుగంధర్, లక్ష్మణ్, లింగయ్య, టీఎన్జీఓ సెక్రటరీ దున్న శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్