
గడువులోగా సీఎంఆర్ లక్ష్యం పూర్తిచేయాలి
సూర్యాపేట : సీఎంఆర్ లక్ష్యాన్ని గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేటలోని కలెక్టరేట్‌లో తన చాంబర్‌లో మిల్లర్లు, అధికారులతో సీఎంఆర్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సీఎంఆర్ గడువు నవంబర్ 12 వరకు పెంచిందన్నారు. మిల్లర్లంతా సహకరించి గడువు నాటికి సీఎంఆర్ ఇవ్వాలన్నారు. మిల్లులను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేస్తూ సీఎంఆర్ పూర్తి చేసేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ మోహన్ బాబు, డీఎం రాము, ఏఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి, మిల్లర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రబాతసేవ, బిందెతీర్థం, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్యకల్యాణం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదనగావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.