
తాడువాయి శివాలయాన్ని సందర్శించిన అధికారులు
మునగాల: మండలంలోని తాడువాయిలో గల శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ శాఖ ఏఈ కిరణ్, సహాయ సంపత్తి సంజీవ్ సందర్శించారు. ఇటీవల గ్రామంలోని శివాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో నూతనంగా దేవాలయ పునర్నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన కొలతలు సేకరించేందుకు వచ్చినట్లు తెలిపారు. గ్రామప్రజలు రూ.10లక్షలు కాంట్రిబ్యూషన్ కింద నిధులు జమచేస్తే దేవాదాయ శాఖ నుంచి రూ.40లక్షలు మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. దేవాలయ పూజారి వారణాసి సత్యనారాయణ శాస్త్రి, గ్రామపెద్దలు కొలిశెట్టి బుచ్చిపాపయ్య, గోపిని రామిరెడ్డి, భద్రంరాజు కృష్ణప్రసాద్, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, వట్టావుల సైదులు, దేవరం సుధీర్‌రెడ్డి, సోమయ్య, భిక్షం, బాలు, జిల్లేపల్లి శ్రీను, బాలకృష్ణ పాల్గొన్నారు.
చెల్లని చెక్కుల పంపిణీ
తిరుమలగిరి: నాగారం మండలంలోని నాగారంబంగ్లాలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌కు సంబంధించి లబ్ధిదారులకు కాలం చెల్లిన చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు కాగా నాగారంబంగ్లాలో గురువారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వీటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ చెక్కులను బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి వెళ్లడంతో బ్యాంకు అధికారులు వీటిని పరిశీలించి చెక్కుపై తేదీ 13–06–2025 అని ఉండటంతో ఈ చెక్కుల గడువు ముగిసిందని, ఇవి చెల్లవని చెప్పారు. దీంతో లబ్ధిదారులు రెవెన్యూ అధికారులను కలసి విషయం చెప్పగా ఇచ్చిన చెక్కులను తిరిగి వాపస్ తీసుకున్నారు. రెవెన్యూ అధికారులను వివరణ కోరగా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు వారం రోజుల క్రితం ఆర్డీఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాయని, వీటిపై తేదీలను గుర్తించలేదని పేర్కొన్నారు. చెక్కులను రీ వ్యాలిడేషన్ చేసి తిరిగి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెక్కుల పంపిణీలో గందరగోళం తలెత్తిందని లబ్ధిదారులు వాపోతున్నారు.