
సైబర్ మోసాల నిర్మూలనలో అంబాసిడర్‌లా ఉండాలి
సూర్యాపేటటౌన్ : యువత, విద్యార్థులు సైబర్ మోసాల నిర్మూలనలో అంబాసిడర్‌లా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో పట్టణ పోలీసులు, షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని నిరంతర సాధన చేయాలన్నారు. దీనికి అనుగుణంగా పద్ధతులు, మెటీరియల్స్ ఎంపిక చేసుకోవాలన్నారు. రైతు విత్తనం నాటితే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే విధంగా మీ తల్లిదండ్రులను మిమ్మల్ని భూమిమీదకు తీసుకువచ్చారని, మీరు సమాజానికి మంచి ఫలాలను ఇచ్చే వృక్షంలాగా ఎదగాలన్నారు. మంచి సమాజం పోలీసుల లక్ష్యం అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో నిరంతరం సాధన చేస్తే విజయాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, షీ టీమ్స్ ఎస్‌ఐ నీలిమ, సీసీఎస్ ఎస్‌ఐ అనిల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాల రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ