
సకాలంలో వేతనాలు ఇవ్వాలి
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు కోరారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు సుమారు పదివేల మందికిపైగా ఉన్నారని వీరికి 6 నెలల నుంచి జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
వారి జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. వారం రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ వారి సమస్యలపై స్థానిక ప్రభుత్వ అధికారులకు, జిల్లా మంత్రికి విన్నవించినా ఎలాంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో బైరోజు మదన్ చారి, కొమ్ము నాగయ్య, ముత్యం నాగేంద్రబాబు, శ్యామ్, కక్కిరేణి నాగేంద్రబాబు, నాగరాజు, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది స్థానికంగా ఉండాలి
మునగాల: పీహెచ్‌సీలలో విధులు నిర్వహించే సిబ్బంది స్థానికంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఓపీ రిజస్టర్‌ను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
1,613 క్యూసెక్కులకు గోదావరి జలాలు పెంపు
అర్వపల్లి: జిల్లాకు వస్తున్న గోదావరి జలాలను బుధవారం 1,613 క్యూసెక్కులకు పెంచారు. దీంతో కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఈ నీటిని జిల్లాలోని 69,70,71డీబీఎంలకు వదులుతున్నారు. చివరి మండలాలతో పాటు చివరి ఆయకట్టుకు నీళ్లు అందేలా నీటిని పెంచారు. రైతులు ఈ గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని నీటిపారుదల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ కోరారు.