
టీచర్లకు టెట్ టెన్షన్
చిలుకూరు: ఉపాధ్యాయులను టెట్ భయం వెంటాడుతోంది. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మెజార్టీ ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. ఐదేళ్లకు పై బడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని, లేదంటే ఉద్యోగం వదులు కోవాలని తీర్పు వెలువరించడం భిన్న వాదనలకు తెరలేపుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే సర్వీసులో ఉన్న వారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ నుంచి మినహాయింపునిచ్చింది.
1985 డీఎస్సీ నుంచి 2024 డీఎస్సీ వరకు..
జిల్లాలో ప్రస్తుతం డీఎస్సీ 1985 నుంచి డీఎస్సీ 2024 వరకు ఎంపికైన ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 3,702 మంది ఉపాధ్యాయులు ఉండగా టెట్ అర్హత సాధించిన వారు 1,163 మంది , టెట్ లేనివారు 2,539 మంది ఉన్నట్లుగా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 2010 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒక సారి, ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2017లో ఒక సారి, 2024లో ఒకసారి ఇలా మూడు సార్లు డీఎస్సీల్లో నియమితులైన వారు టెట్‌లో అర్హత సాధించగా .. . రెండేళ్ల కింద ఎన్‌సీటీఈ ఉత్తర్వులతోనూ కొందరు అర్హత సాధించారు. అలాంటి వారు కేవలం తక్కువ మంది ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఏడాది వ్యవధిలో జిల్లాలో 250 మందికి పైగా జీహెచ్‌ఎంలుగా, ప్రాథమిక పాఠశాల టీచర్ల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా టెట్ అర్హత లేకుండా పదోన్నతి పొందారు. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో రాబోవు పదోన్నతుల్లో జూనియర్లకు మేలు జరగనుంది. టెట్ మినహాంపు ఇవ్వాలని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునః సమీక్షించేలా రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఫ కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు
ఫ జిల్లాలో మొత్తం 3,702 మంది
ఉపాధ్యాయులు
ఫ టెట్ అర్హత సాధించిన వారు 1,163మంది
ఫ టెట్ లేని వారు 2,539 మంది