
వానాకాలం ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
సూర్యాపేట : వచ్చేనెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో 2025– 26 వానాకాలం ధాన్యం కొనుగోలుపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.ఈ వానాకాలం జిల్లాలో 10,30,868 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నామని, కొనుగోలు కేంద్రాల్లో 4,30,880 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. అక్టోబర్ 20 నుంచి ధాన్యం వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గతంలో తప్పు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఎట్టి పరిస్థితులలో ఈ వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటాయించవద్దని సూచించారు. ధాన్యం రవాణాకు ఎలాంటి సమస్య రాకుండా ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను వెహికిల్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు మాట్లాడుతూ మిల్లర్లు ధాన్యం కొనుగోలు సందర్భంగా బ్యాంకు గ్యారంటీలను తప్పనిసరిగా ముందే ఇవ్వాలన్నారు. అలాగే పత్తి కొనుగోలుపై సమీక్షించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి మోహన్ బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఆర్‌డీఓ అప్పారావు, జిల్లా కోపరేటివ్ అధికారి పద్మ, జిల్లా మార్కెటింగ్ అధికారి సతీష్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.మధు, లీగల్ మెట్రాలజీ అధికారి చిట్టిబాబు, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ప్రకాష్ రెడ్డి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.