
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు
సూర్యాపేట : ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ (డీఆర్‌ఏ) కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ల నియమ నిబంధనలు పాటించే వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారం లోపల తాత్కాలిక అనుమతి ఇచ్చి తర్వాత క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేసి అన్ని నియమ నిబంధనలు పాటిస్తే శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే నోటీసులు జారీ చేసి కారణాలు తెలుపుతూ తిరస్కరించాలని, మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఎక్కడైనా అర్హత లేని వారు వైద్యం, లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీఎంహెచ్‌ఓ పి.చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు జి.చంద్రశేఖర్, నాజియా, కోటిరత్నం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయ మనోహరి, మీడియా అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్