
పనులు వదులుకొని వచ్చినా నిరాశే
తిరుమలగిరి (తుంగతుర్తి): రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో రైతులు రోజూ పీఏసీఎస్‌లు, మనగ్రోమోర్ కేంద్రాల బాటపడుతున్నారు. పనులన్నీ వదులుకొని రాత్రింబవళ్లు చాంతాడంత క్యూలో నిరీక్షించినా దొరకని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల యూరియా కోసం రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం ముందు మంగళవారం ఉదయం నుంచి రైతులు బారులుదీరారు. టోకెన్లు ఉన్న రైతులకు ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున యూరియా అందజేశారు. మిగిలిన రైతులకు టోకెన్లను అందించారు.
తిరుమలగిరి: యూరియా కోసం రైతులు నూతనకల్ మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇదే సమయంలో పీఏసీఎస్ కార్యాలయంలో బస్తాలు ఉన్నప్పటికీ రైతులకు వాటిని అందించకుండా ఆలస్యం చేయడంతో రైతులు కార్యాలయం షెట్టర్లను పగులగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో సమాచారం అందుకున్న సీఐ నర్సింహారావు, తహల్దార్ ఎం. శ్రీనివాసరావులు ధర్నా చేస్తున్న రైతుల వద్దకు వచ్చి వారితో మాట్లాడారు. నేటి వరకు టోకెన్లు ఇచ్చిన మాట వాస్తవమేనని ఈ నెల 19,20తేదీల్లో రావాల్సిన యూరియా లోడ్ రాక ఆకస్మత్తుగా టోకెన్‌తీసుకున్నవారు రావడంతో గందరగోళం ఏర్పడిందని తెలిపారు. టోకెన్‌లు ఇచ్చిన ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేసిన తరువాతనే కొత్త వారికి టోకెన్‌లు అందిస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకోను విరమించారు. పీఏసీఎస్ కార్యాలయంపై దాడి గురించి సిబ్బంది నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పనులు వదులుకొని వచ్చినా నిరాశే