సూర్యాపేటటౌన్ : జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెండు రోజులుగా కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ సంబంధిత శాఖ అధికారులతో కలిసి తీవ్ర కసరత్తు చేశారు. ప్రధానంగా జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఆర్డీఓలతో పాటు అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. మండలాల్లో ఉన్న జనాభా, ఇందులో ఎస్సీ, ఎస్టీలకు గతంలో కేటాయించిన స్థానాలు, ప్రస్తుతం కేటాయించాల్సిన స్థానాలు, బీసీ జనాభా గతంలో రిజర్వేషన్, ప్రస్తుతం కేటాయించాల్సిన స్థానాలపై చర్చించారు. ఈ క్రమంలో 2019 రిజర్వేషన్ల వివరాలను సేకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించగా మిగిలిన స్థానాలను జనరల్ కేటగిరీకి కేటాయించి మొత్తంగా 50శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసేలా రిజర్వేషన్ల కసరత్తు జరిగినట్టు సమాచారం.
వీరి సమక్షంలోనే..
జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు, 4388 వార్డులు, 235 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, సర్పంచ్‌ల రిజర్వేషన్లను ఆర్డీఓల సమక్షంలో, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను కలెక్టర్ ఆధ్వర్యంలో ఖరారు చేసినట్టు సమాచారం. ఏ స్థానం ఎవరికి రిజర్వ్ చేశారో తెలుసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 475 స్థానాలకు గాను ఎస్సీలకు 97 స్థానాలు, ఎస్టీలకు 111 స్థానాలు, బీసీలకు 65 స్థానాలను కేటాయించారు. ఇందులో జనరల్ కేటగిరిలో 202 స్థానాలు కేటాయించారు.