బీసీ రిజర్వేషన్ల పెంపుతో మారనున్న స్థానాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు జరిపేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వార్డులు, గ్రామాలు, మండలాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్, 2024 కులగణన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జాబితాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
నెలాఖరులో నోటిఫికేషన్ వచ్చేనా?
గవర్నర్‌కు, రాష్ట్రపతికి పంపించిన రిజర్వేషన్ బిల్లులు పెండింగ్‌లోనే ఉండిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనకు వచ్చింది. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈనెలాఖరులోగా నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీఓ జారీ చేసి, ఎన్నికలకు వెళ్లేలా చర్యలు చేపట్టడం, అదే విషయాన్ని కోర్టుకు తెలియజేయాలన్న ఆలోచనలో ఉంది. ఈమేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. రిజర్వేషన్ల జాబితాల ఖరారుతోపాటు పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడం వంటి పనులు పూర్తి చేసుకోవాలని పేర్కొంది. దీంతో సూర్యాపేట జిల్లా యంత్రాంగం అదే పనిలో నిమగ్నమైంది.
మండలాల వారీగా ఎవరి శాతం ఎంత?
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ అధికారులు స్థానిక ఎన్నికలపై కసరత్తు మొదలు పెట్టారు. సూర్యాపేట జిల్లాలో డీపీఓ యాదగిరి, జెడ్పీ సీఈఓ అప్పారావు ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను, 2024 కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ముందుగా మండలాల వారీగా ఎవరు ఎంత శాతం ఉన్నారనే దానిపై జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత గ్రామాలు, వార్డుల వారీగా కూడా జాబితాలు సిద్ధం చేస్తామని పేర్కొంటున్నారు. 2006, 2013, 2019లో రిజర్వేషన్లను పరిశీలిస్తూనే కొత్త రిజర్వేషన్ల జాబితాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు షురూ
ఫ వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్న అధికారులు
ఫ జిల్లా పరిషత్, పంచాయతీ శాఖల అధికారులతో కలెక్టర్ భేటీ
ఫ బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక జీఓతో
ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుండటంతో ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్లు అన్నీ మారిపోనున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటివరకు ఉన్న రిజర్వేషన్లనే అమలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొలగించి రిజర్వేషన్ల రొటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ప్రస్తుతం పెరగనున్న బీసీ రిజర్వేషన్లతో రిజర్వేషన్ల స్థానాలన్నీ మారిపోనున్నాయి. మరోవైపు బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు లభించనున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన తర్వాతే మిగిలిన స్థానాలు జనరల్‌కు కేటాయించి, అందులో మొత్తంగా మహిళా రిజర్వేషన్లను 50 శాతం అమలు చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా జీఓ విడుదల చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏయే మండలాల్లో ఎంత మంది ఉన్నారనేది తేల్చాలని చెప్పింది. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేసి పెట్టుకున్న అధికారులు రిజర్వేషన్లకు సంబంధించిన జనాభా లెక్కలు తేల్చే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అయితే ప్రభుత్వం జీఓ విడుదల చేసిన తర్వాతనే అధికారికంగా రిజర్వేషన్ల ఖరారును అధికారులు ప్రకటించనున్నారు.
జీఓ వచ్చాకే రిజర్వేషన్ల ప్రకటన