
25,26 తేదీల్లో పీవైఎల్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : కోదాడ పట్టణంలో ఈనెల 25, 26 తేదీల్లో ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య తెలిపారు. సోమవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో శిక్షణతరగతులకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ యువకులకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. కార్యక్రమంలో పీవైఎల్ మండల నాయకులు పగిడి విజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, తోట పవన్, చిత్తలూరి మహేష్, కడపత్తి మహేష్, చిత్తలూరి వెంకన్న, గడ్డం కృష్ణ, గడ్డం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల నుంచి
దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రారంభించిన రెండు ప్రధాన పథకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ పోర్టల్ https:// tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎల్. శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.‘రేవంత్ అన్నకా సహారా– మిస్కీనో కే లియే’ ఈ పథకం కింద ఫఖీర్, దూదేకుల, ఇతర అట్టడుగు ముస్లిం వర్గాల అభ్యున్నతికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యూనిట్ ఖర్చు: రూ.1,00,000/– వరకు వందశాతం సబ్సిడీతో మోపెడ్లు/బైక్‌లు /ఇ–బైక్‌లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు ఫఖీర్, దూదేకుల, అట్టడుగు ముస్లిం వర్గానికి చెంది ఉండాలని, రేషన్ కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి, వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక సహాయం పొందకుండ ఉండాలని, ఒక కుటుంబానికి ఒకే లబ్ధిదారుడు/లబ్ధిదారురాలు మాత్రమే అర్హులని సూచించారు. అలాగే‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ కింద మైనారిటీ మహిళలు అంటే ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు చెందిన వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, ఒంటరి మహిళలలు తమ ఆర్థిక ఉన్నతికి చిన్నపాటి వ్యాపారం ఏర్పాటు చేసేందుకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.50,000 ఒక్కసారిగా ఆర్థిక సహాయం చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారులు రేషన్ కార్డు కలిగి ఉండి, వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని, కనీస విద్యార్హత – 5వ తరగతి ఉత్తీర్డులై ఉండాలని సూచించారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2.00 లక్షలకు మించరాదని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఇతర ఆర్థిక సహాయం పొందకుండ ఉండాలని, ఈ పథకాలకు ఆన్‌లైన్ ద్వాదా దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6వ తేదీ వరకు గడువు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ట్రంప్ తీరుపై
పెదవి విప్పని మోదీ
సూర్యాపేట అర్బన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధిస్తున్న సుంకాలు, హెచ్–1 బి వీసాల రుసుం విషయంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ పెదవి విప్పకపోవడం సరైంది కాదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు సోమవారం సూర్యాపేట పట్టణంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చే నిపుణులకు లక్ష డాలర్ల రుసుం కడితేనే హెచ్–1బీ వీసా జారీ చేస్తామని నిబంధన పెట్టడం సరికాదన్నారు. దీనివల్ల సాఫ్ట్‌వేర్ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. అమెరికా విధానాలను ప్రతిఘటించకుండా ఆ దేశానికి సాగిలపడేలా మోదీ పాలన కొనసాగుతోందని విమర్శంచారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట గోపి పాల్గొన్నారు.

25,26 తేదీల్లో పీవైఎల్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు