
వేలానికి దొడ్డు బియ్యం
పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాలేదు
భానుపురి (సూర్యాపేట) : రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వేలం వేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయడంతో ఇప్పటికే రేషన్ షాపులకు సరఫరా అయిన దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. దొడ్డు బియ్యం పంపిణీ నిలిచిపోవడంతో ఇ– వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
1,200 మెట్రిక్ టన్నులు
రేషన్ షాపుల్లో సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏప్రిల్ నుంచి అనుకోకుండా అమలు చేయడంతో అప్పటికే రేషన్ షాపులకు సరఫరా అయిన దొడ్డు బియ్యం అలాగే ఉండిపోయింది. నాటి నుంచి ప్రతినెలా సన్నబియాన్నే లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. దీంతో జిల్లాలోని 610 రేషన్ దుకాణాల్లో పాత కార్డుల ప్రకారం 3,24,158 కార్డుదారులకు సరఫరా చేసిన దాదాపు 1,200 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు అలాగే ఉన్నాయి.
కిలో రూ.20 నుంచి రూ.24చొప్పున..
జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ ఆధీనంలో ఉన్న 1,200 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఇ– వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించినప్పటికీ జిల్లా అధికారులకు పూర్తిస్థాయిలో అందలేదు. కిలో దొడ్డు బియ్యం రూ. 20 నుంచి రూ.24 చొప్పున ఇ–వేలం ద్వారా అమ్మేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరు నెలలుగా బియ్యం నిల్వలు ఉండడంతో పురుగులు పట్టి పోయాయి. అయితే ఈ బియ్యం అలాగే ఉంటే ప్రతి నెలా లబ్ధిదారులకు అందించే సన్న బియ్యానికి కూడా పురుగులు పట్టడం, రేషన్ షాపుల్లో స్థలం కొరత తదితర కారణాలతో విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
వేలం సక్రమంగా జరిగేనా..
ఆరు నెలలుగా నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఇప్పుడు తూకం వేస్తే తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే రేషన్ షాపులతో పాటు పలుచోట్ల గోదాముల్లో ఈ బియ్యం నిల్వలు ఉన్నాయి పురుగులు పట్టి బియ్యం పాడైపోయాయి. ఇ– వేలం వేస్తే ఆఫీసుల్లో పేపర్ల పై ఉన్న నిలువలను మాత్రమే లెక్కిస్తారు. తూకం తక్కువ వస్తే నష్టం వచ్చిన బియ్యాన్ని ఎవరు భరించాలి అన్నది సమస్యగా మారింది.
రేషన్ షాపుల్లో 1,200
మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం
సన్నబియ్యం పంపిణీతో
దుకాణాల్లోనే నిల్వ
ఇ–వేలం ద్వారా
విక్రయించేందుకు సన్నాహాలు
జిల్లాలో 1,200 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీకి ముందు వీటిని రేషన్ షాపులకు తరలించారు. ప్రస్తుతం ఈ బియ్యాన్ని ఇ–వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు రాలేదు. వస్తే వేలం నిర్వహిస్తాం.
– మోహన్ బాబు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి