
తెగులు.. దిగులు!
నాగారం : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో వరిసాగు చేసిన రైతులు సరైన సమయానికి సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పంటలకు తెగుళ్ల బెడద పట్టుకుంది. దోమపోటు, ఎండు తెగులు, అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు తదితరాలు ఎక్కువగా సోకుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తెగుళ్లను నివారించేందుకు రైతులు అనేక పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో పంటల సాగుకు ఖర్చులు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యకం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా మోతాదుకు మించి క్రిమిసంహారక మందుల్ని రైతులు అధికంగా వినియోగిస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది పంట దిగుబడిపై ఎంతో ప్రభావం చూపుతోందంటున్నారు.
సస్యరక్షణ చర్యలు నామమాత్రమే..
జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 4,85,125 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సారి భారీగా వర్షాలు కురవడంతో వరిలో కలుపు నివారణతో పాటు తెగుళ్లు రాకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా చేశాయి. వర్షాల వల్ల కొన్ని పంటలు దెబ్బతినడంతో రైతులు వరి ఎదుగుదలకు మోతాదుకు మించి ఎరువులు వాడారు. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కుస్తున్నాయి. ఈ నెలలో దోమపోటు, కాండం తొలిచే పురుగు ఉధృతి కనిపించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వరిలో కొనలు ఎర్రగా మారి మొక్క ఎదుగుదల లేకుండా పోయిందని చెబుతున్నారు.
వ్యవసాయాధికారుల సూచనలు..
ఫ ప్రస్తుతం పిలక దశ నుంచి అంకురం దశలో ఉన్న వరిలో పైపాటుగా రసాయన ఎరువులు వాడాలి. దుబ్బు చేసే దశలో, అంకురం తొడిగే దశలో బురద పదునులో మాత్రమే వెదజల్లి మరలా 48 గంటల తర్వాత నీరు పెట్టాలి.
ఫ కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు ఆశించకుండా పొలం గట్లకు కలుపు లేకుండాచేయాలి.
ఫ ప్రస్తుతం వరిలో కాండంతొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు, పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఫ వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుంచి నీటిని తీసివేయాలి. ప్లాంటోమైసిన్ 0.2గ్రా, కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా.లేదా అగ్రిమైసిన్ 0.4గ్రా. కాపర్‌ఆక్సి క్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఫ ప్రస్తుతం అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. దీని నివారణకు ట్రైసైక్లాజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రొథైయోలిన్ 1.5 మీ.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మీ.లీ. లేదా ట్రైసైక్లోజోల్, మ్యాంకోజేబ్ మిశ్రమ మందు 2.5గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మేలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
సన్నరకం వరి పంటకు
చీడపీడల బెడద
ఫ అధికంగా దోమపోటు,
ఎండు, అగ్గి తెగుళ్లు
ఫ వేధిస్తున్న కాండం తొలిచే పురుగు
ఫ ఆందోళనలో అన్నదాతలు
ఫ జిల్లా వ్యాప్తంగా 4.85 లక్షల
ఎకరాల్లో వరిసాగు