
దుర్గామాత మండపాలకు అనుమతి తీసుకోండి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : దేవీనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న దుర్గామాత మండపాల సమాచారం పోలీసులకు ఇవ్వాలని, ఆన్‌లైన్ లింక్‌లో వివరాలు నమోదు చేసి అనుమతి తీసుకోవాలని ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ పటిష్ట రక్షణ కల్పిస్తుందని, అన్ని కాలనీల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో విలువైన ఆభరణాలు ధరించకుండా మహిళలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దేవీ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పండుగ సెలవుల దృష్ట్యా సొంత గ్రామాలు, దూరప్రాంతాలకు వెళ్లేవారు విలువైన వస్తువులు, ఆభరణాలు ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు.
మట్టపల్లిలో వైభవంగా పవిత్రారోపణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నా యి. ఉత్సవాల మూడవ రోజులో భాగంగా ఆదివారం యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం పవిత్రారోపణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే దేవోత్తాపన, ఆరాధన, అష్టోత్తరశతకలశస్నపన, ప్రధానహోమం, బలిహరణ, మూలమంత్రహోమం తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా చివరిరోజైన సోమవారం అగికనారాధనలు, పూర్ణాహుతి, పవిత్రాల విసర్జనోత్సవం, మహాశాంతిహోమం ఉంటాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
పెండింగ్ డీఏలను
మంజూరు చేయాలి
సూర్యాపేటటౌన్ : పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేస్తూ పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని టీపీటీయూ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్‌ను రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో నగదు రహిత హెల్త్ కార్డులను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కడపర్తి శ్రీనివాస్ నాయుడు, కె.నాగయ్య, బి.శ్రీనివాస్ గౌడ్, ఏ.రమేష్, బి.శంకర్‌రావు, జి.కేశయ్య, ముంతా శ్రీనివాస్, వి.అంజయ్య, డి.ఉపేందర్, కె.శ్రీనివాస్, కే.సైదులు, ఎస్.రమేష్, డి.శ్రీనివాస్, ఎం.మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతులను
జయప్రదం చేయాలి
కోదాడరూరల్ : కోదాడ పట్టణంలోని లాల్‌బంగ్లాలో ఈ నెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్న ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లగొండ నాగయ్య, ధరావత్ రవి పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ పట్టణంలోని లాల్‌బంగాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యరంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో పేదలకు వైద్యం అందని పరిస్థితి నెలకొందన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలో గొప్ప మార్పు వస్తుందన్నారు.

దుర్గామాత మండపాలకు అనుమతి తీసుకోండి : ఎస్పీ