
యూరియా కోసం అవే బారులు
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శుక్రవారం 444 బస్తాల యూరియా రావడంతో టోకెన్లు ఉన్న రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున ఇచ్చారు. ఈ క్రమంలో రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు టోకెన్లు, యూరియా బస్తాల కోసం మండుటెండలో గంటల తరబడి బారులుదీరారు. కనీసం కార్యాలయం ముందు నీడ కోసం టెంట్లు గాని, మంచినీటి సదుపాయం లేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద టోకెన్లు పంపిణీ చేస్తారని సమాచారంతో శుక్రవారం తెల్లవారకముందే రైతులు మహిళలు, పురుషులు వేరువేరుగా క్యూలైన్లలో నిలుచున్నారు. 8 గంటల వరకు పురుషుల క్యూలైన్ పాఠశాల గోడ వద్దకు చేరింది. దాదాపు 800 మందికి పైగా క్యూలైన్‌లో నిలిచి ఉండగా టోకెన్లు జారీచేసి మళ్లీ యూరియా వచ్చినప్పుడు తీసుకువెళ్లాలని సూచించారు. అనంతరం రెండు రోజుల క్రితం జారీ చేసిన టోకెన్లకు యూరియా పంపిణీ చేశారు.