
యూరియా అందించాలని రోడ్డెక్కిన రైతులు
ఫ తుంగతుర్తిలో అధికారులపై ఆగ్రహం
ఫ అర్వపల్లిలో రహదారిపై రాస్తారోకో
ఫ నెల రోజులుగా ఇబ్బందులు
పడుతున్నామని ఆవేదన
తుంగతుర్తి : యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తి సొసైటీకి 600 బస్తాల యూరియా వచ్చిందని తెలియడంతో వేకువ జాముననే రైతులు సొసైటీ వద్ద క్యూకట్టారు. ఈరోజు యూరియా ఇవ్వడం లేదని అధికారులు చెప్పడంతో అన్నారం, సంగెం గ్రామ రైతులు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వస్తున్న సమాచారంతో సొసైటీ అధికారులు మధ్యాహ్నం యూరియా బస్తాలు ఇవ్వడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల రైతులు ఉదయం ఇవ్వబోమని చెప్పి ఇప్పుడు ఎలా ఇస్తారని సొసైటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీలో ఉన్న 150 బస్తాల యూరియా బస్తాలను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.
అర్వపల్లిలో ఆందోళన
అర్వపల్లి: అర్వపల్లిలోని పీఏసీఎస్‌కు కొద్దిరోజులుగా యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం 365బీ హైవేపై రాస్తారోకో చేపట్టారు. తెల్లవారుజాము నుంచే కార్యాలయం వద్దకు వచ్చిన రైతులు చెప్పులను క్యూలైన్‌లో పెట్టి పక్కన కూర్చుని నిరీక్షిస్తున్నారు. ఈ రోజ యూరియా రావడం లేదని అధికారులు తెలపండంతో కొందరు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాగా సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ రమేష్‌బాబులకు ఫోన్‌చేసి పరిస్థితిని తెలియజేయగా ఒకటి రెండు రోజుల్లో పీఏసీఎస్‌కు యూరియా రానుందని తెలిపారు. అయితే రాస్తారోకోతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్‌ఐ ఈట సైదులు తన సిబ్బందితో వచ్చి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.