
ఆపద అంటే ఆ..పద అంటూ
టెక్కలి:
యువతలో సామాజిక దృక్పథం పెరుగుతోంది. సెల్‌ఫోన్ వదలడం లేదని, ఉత్తి పుణ్యానికే సహనం కోల్పోతున్నారని, వయసుకు తగ్గ పరిపక్వత ఉండడం లేదని యువకులపై వస్తున్న విమర్శలను తాజా వరద కడిగి పారేసింది. జిల్లాను ముంచెత్తిన వరదలకు యువత అడ్డుగా నిలబడ్డారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ స్ఫూర్తి రగిలించారు. అత్యవసర సమయాల్లో అధికార యంత్రాంగం కోసం ఎదురు చూడకుండా వారే సేవకులుగా మారుతున్నారు.
ఇటీవల తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలో వంశధార, మహేంద్రతనయ, నాగావళి, బాహుదా వంటి నదులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, గెడ్డలు, వాగులు పొంగి పొర్లి గ్రామాల్లోకి వరద నీరు చేరి భయానక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో వివిధ చోట్ల వరదల్లో చిక్కుకున్న వారికి తమకు తోచిన విధంగా స్థానిక యువత సేవా కార్యక్రమాలను చేపట్టారు. నందిగాం మండలం ఉయ్యాలపేట గ్రామం వద్ద ఓ వృద్ధుడికి అత్యవసరంగా వైద్య సేవలు అవసరం కావడంతో స్థానిక యువత వరద నీటి నుంచి ఆ వృద్ధుడిని రక్షించింది. అలాగే జలుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలో కూలిపోయిన ఇంటి నుంచి వృద్ధులను స్థానిక యువకులే కాపాడారు. జి.సిగడాం మండలం ధవళపేట వద్ద రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును అక్కడి వారే తొలగించారు. వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురం గ్రామంలో వరద నీటి నుంచి తాడు సాయంతో గ్రామస్తులను తరలించారు. విపత్తుల సమయాల్లో అధికారుల కోసం ఎదురు చూడకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి సాయం అందజేస్తూ పలువురు ప్రశంసలు పొందుతున్నారు.
ఆపద అంటే ఆ..పద అంటూ యువత నిండు గుండెతో స్పందిస్తున్నారు. ఆపత్కాలంలో ఆపద్బాంధవుల్లా వ్యవహరిస్తున్నారు. నీరు, కన్నీరు కలిసి ప్రవహించిన వరదకు ఎదురొడ్డి నిలబడుతున్నారు. కష్టంలో తడిచిన బతుకులకు భుజాన్ని సాయంగా అందిస్తున్నారు. అధికారుల కోసమో, నాయకుల కోసమో ఎదురు చూడకుండా తాము స్వయంగా రంగంలోకి దిగి సేవ అనే పవిత్ర యాగాన్ని కొనసాగిస్తున్నారు.
ఆదుకునే మనసు ఉండాలి
విపత్తులు, ప్రమాదాలు సంభవించే సమయాల్లో ప్రతి గ్రామంలో యువత సాయం చేయడానికి ముందుకు రావాలి. అధికారులు వస్తారని ఎదురుచూడకుండా తక్షణ సాయం చేయాలి. మా గ్రామంలో యువకులంతా అదే పని చేశాం. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయే విధంగా వరద నీరు పోటెత్తిన సమయంలో ఓ వృద్ధుడికి అత్యవసరంగా వైద్య సేవలు అవసరమయ్యాయి. అంతా కలిసి అతడిని ఆస్పత్రికి తరలించాం. – రెళ్ల అప్పారావు,
ఉయ్యాలపేట, నందిగాం మండలం.
యువతలో పెరుగుతున్న సేవాభావం
విపత్తుల వేళ స్వచ్ఛందంగా చేయూత
వరద సమయాల్లో అత్యవసర సాయం
అధికారుల కోసం ఎదురుచూడకుండా రంగంలోకి దిగుతున్న వైనం

ఆపద అంటే ఆ..పద అంటూ

ఆపద అంటే ఆ..పద అంటూ