తహసీల్దార్లపై కలెక్టర్ సీరియస్
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన తహసీల్దార్లపై కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన ముదిగుబ్బ, కదిరి, బుక్కపట్నం తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అర్జీలన్నీ పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సర్వేను వేగవంతం చేయాలన్నారు. ఏప్రిల్ 30 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పాస్ పుస్తకాల పంపిణీలో ధర్మవరం, కదిరి, కొత్తచెరువు మండలాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.
ప్రశాంతి నిలయం: ‘‘విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం ప్రభుత్వానికి చెల్లించే మొత్తం కాకుండా మామూళ్ల కింద విద్యుత్ శాఖ ఏఈకి అదనంగా రూ.40 వేలు ఇచ్చినా...ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వక పోగా, రూ.24 వేలకే బిల్లులు ఇచ్చాడు. అయినా ట్రాన్స్‌ఫార్మర్ నేటికీ మంజూరు చేయలేదు’’ అని రొద్దం మండలం రాగిమేకలపల్లి గ్రామానికి చెందిన రైతులు నరేష్, మాల అంజినప్ప, వడ్డ్డే గోపాల్, నాగరత్నమ్మ, సుబ్బరాయుడు తదితరులు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జెడ్పీటీసీ అక్కులప్పతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వారు విద్యుత్‌శాఖ ఏఈపై ఫిర్యాదు చేశారు. బోర్లకు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీరి నుంచి అర్జీ స్వీకరించిన జేసీ... విచారించి న్యాయం చేస్తానన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై మొత్తంగా 131 అర్జీలు అందాయి. జేసీ మౌర్యభరద్వాజ్, డీఆర్‌ఓ విజయసారథి, ఎస్‌డీసీ శ్రీకర్, ఆర్డీఓ సువర్ణ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యకమ్రం అనంతరం జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు.
సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్..
ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో వందకు పైగా అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి వేర్వేరుగా అర్జీలు స్వీకరించారు. ఇందులో పలువురికి అడంగల్ అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయ సారథి, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్, శర్మ, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ట్రైసైకిల్ పంపిణీ..
‘పరిష్కార వేదిక’కు వచ్చిన గోరంట్లకు చెందిన హుస్సేన్ పీరాకు జేసీ మౌర్య భరద్వాజ్ ట్రైసైకిల్‌ను పంపిణీ చేశారు. ఆయన ఇదివరకే ట్రై సైకిల్ కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు.
విద్యుత్ శాఖ ఏఈపై
జాయింట్ కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు
‘పరిష్కార వేదిక’కు 131 అర్జీలు


