ప్రశాంతి నిలయం: ‘‘వరుణుడు కరుణించలేదు..పట్టించుకోవాల్సిన పాలకులూ ఇక్కడి నీటిని హంద్రీనీవా కాలువకు లైనింగ్ వేసి మరీ కుప్పానికి తరలించారు. దీంతో బోర్లన్నీ ఒట్టిపోయి రైతులు పంటలు సాగుచేసుకోలేకపోయారు. నాడు కళకళలాడిన పొలాలన్నీ నేడు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా స్పందించి పేరూరు డ్యాంకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోండి’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కోరారు. సోమవారం రైతులతో కలిసి పుట్టపర్తికి వచ్చిన ఆయన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ మౌర్య భరద్వాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో 65 కిలోమీటర్లు కాలువ తవ్వించి నీటిని విడుదల చేసి పేరూరు డ్యాంను కళకళలాడించామన్నారు. కానీ ప్రస్తుత పాలకులు డ్యాంకు నీరు ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిటాల సునీత వల్లే రైతులకు అన్యాయం..
రాప్తాడు కరువు పరిస్థితులకు ఎమ్మెల్యే పరిటాల సునీత కారణమని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో తాము రాప్తాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తే.. నేడు సాగునీరు లేక బీడు భూములు కనిపిస్తున్నాయన్నారు. సాగునీటి సమస్యతో పంటలు సాగుచేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తే కనీసం రెండు పంటలను సాగు చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా... రైతుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాము పాపంపేటకు నీళ్లివ్వాలని ప్రయత్నించినప్పుడు ఇళ్లను కూల్చివేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా... పేరూరు డ్యాంకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. హంద్రీనీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేసి నీటిని చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి తరలించారన్నారు. దీంతో గతంలో వంద అడుగుల లోతులోనే బోర్లలో నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం 400 అడుగులు వేసినా నీరు రావడం లేదన్నారు. 2018లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూజ చేసినప్పటికీ పూర్తి చేయలేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.170 కోట్లు పనులకు బిల్లులు చేశామన్నారు. అయితే ఒక్క పనీ చేయకుండా పేరూరు డ్యాంకు పరిటాల రవి పేరు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రంగంపేట గోపాల్‌రెడ్డి, మజ్జిగ శంకరయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి, రామగిరి, కనగానపల్లి జెడ్పీటీసీలు నాగార్జున, మారుతి, పెద్దిరెడ్డి, చంద్రకుమార్, మీనుగ నాగరాజు, రాజేష్, నాగముని, తలమర్ల సంజీవరెడ్డి ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్
రైతులతో కలిసి జేసీకి
వినతి పత్రం అందజేత


