‘పరాఖ్‌’ సర్వేను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

‘పరాఖ్‌’ సర్వేను విజయవంతం చేయండి

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

పుట్టపర్తి: ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో చేపట్టిన పరాఖ్‌ సర్వేను విజయవంతం చేయాలని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. సోమవారం సమగ్రశిక్ష ఆధ్వర్యంలో బుక్కపట్నం డైట్‌ కళాశాలలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. మూడో తరగతి విద్యార్థులకు ఫండమెంటల్‌ లెర్నింగ్‌ స్టడీ సర్వే జరుగుతోందని, ఇందులో భాగంగా ఎంపిక చేసిన 18 పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసనా స్థాయిలను అంచనా వేస్తారన్నారు. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరించే డైట్‌ విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్లి టెస్ట్‌ నిర్వహించాలన్నారు. విద్యాధికారులు సీఆర్పీలను సమన్వయం చేసుకొని 16, 17, 18 తేదీల్లో సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ గోపాల్‌, మానిటరింగ్‌ అధికారి చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌ ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్‌లో

తెలంగాణ స్టేట్‌ ఫస్ట్‌ వైష్ణవి

కదిరి అర్బన్‌: తెలంగాణ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కదిరికి చెందిన చల్లా ధనుంజయ, చల్లా ధనలక్ష్మీ దంపతుల కుమార్తె చల్లా వైష్ణవి (ఎంపీసీ ఈటీ ఒకేషనల్‌ విభాగం) స్టేట్‌ ఫస్ట్‌ స్థానాన్ని కై వసం చేసుకుంది. వైష్ణవి ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌ (ఈటీ)లో 500 మార్కులగాను 498 మార్కులు సాధించి స్టేట్‌ ఫస్ట్‌గా నిలిచింది. తండ్రి ధనుంజయ బస్‌ మెకానిక్‌గా పని చేస్తున్నారు.

రావులచెరువు

వీఆర్‌ఏపై దాడి

ధర్మవరం రూరల్‌: పాతకక్షల నేపథ్యంలో మండల పరిధిలోని రావులచెరువు వీఆర్‌ఏ శివానందపై కొందరు దాడి చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఓ విషయమై మూడు నెలల క్రితం వీఆర్‌ఏ శివానందతో గ్రామానికి చెందిన కొందరు ఘర్షణ పడ్డారు. ఆరోజు మాటామాటా అనుకున్నారు. దీన్ని వారు మనసులో పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో వీఆర్‌ఏ శివానంద ఇంటి వద్ద ఉండగా... అక్కడికి వచ్చిన మేకల ఉపేంద్ర, మేకల లక్ష్మయ్య, మేకల నరసమ్మ, మేకల కుమార్‌ కట్టెలు, రాళ్లతో అతనిపై దాడి చేశారు. గాయపడిన శివానందను చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు నెలల క్రితం జరిగిన ఘర్షణే దాడికి దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement