పుట్టపర్తి టౌన్: తనకు, తన కుటుంబీకులకు రేగాటిపల్లికి చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ధర్మవరానికి చెందిన ఓబుళరెడ్డి ఎస్పీ సతీష్‌కుమార్‌ను కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఎస్పీ సతీష్‌కుమార్‌కు ఓబుళరెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ కార్యాలయ ఆవరణలో కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రేగాటిపల్లికి చెందిన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్‌రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనను గ్రామం నుంచి తరిమివేయాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ 11వ తేదీన చిలకం మధుసూదన్‌రెడ్డి ఓ ప్లాన్ వేశారన్నారు. అందులో భాగంగా తన పేరు (ఓబుళరెడ్డి)తో సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి ఇష్టానుసారం పోస్టులు చేశారన్నారు. వాటి ఆధారంగా ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసు నమోదు చేయించారన్నారు. దీంతో పోలీసులు తనను చిత్ర హింసలకు గురి చేసి కేసు నమోదు చేసి జైలుకు తరలించారన్నారు. ప్రస్తుతం తాను బెయిల్‌పై బయటకు వచ్చానని, అయినా అధికారం అండతో చిలకం తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారన్నారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు.
ఓర్వలేకే అక్రమ కేసులు..
ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కూటమి పార్టీల నేతలు వైఎస్సార్ సీసీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసులు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికి ఎక్కడ కోల్పోతామేమోనన్న భయంతో చిలకం మధుసూదన్‌రెడ్డి వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని కేసులతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అశోక్, కేశవరెడ్డి, శివారెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, నారాయణరెడ్డి, భాస్కర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, పెద్దిరెడ్డి, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన ఓబుళరెడ్డి


