ప్రశాంతి నిలయం: ‘‘కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డాగా మారింది. కే–ట్యాక్స్ పేరుతో కందికుంట ట్యాక్స్‌ను అధికారులే అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి, జనసేన కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భైరవ ప్రసాద్, న్యాయవాది, టీడీపీ నాయకుడు నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులే ఫీజులతో పాటు కే–ట్యాక్స్ అనే కోడ్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. రెండేళ్లుగా ఉన్నత స్థాయి సిబ్బంది, దళారీల సహకారంతో భవనాల మార్కెట్ విలువలు తగ్గించి రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిషేధించిన, వివాదాస్పద భూములను నిబంధనలు ఉల్లంఘించి అధికారులను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిపిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రతి నెలా రూ.కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. రైతులు, చిరువ్యాపారుల ఫైళ్లు మాత్రం పెండింగ్‌లో పెట్టి ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. సుమారు రూ.20 కోట్ల కుంభకోణం జరిగినట్లు చెప్పారు. సిబ్బంది ఫోన్ కాల్ డేటా, వారి వ్యక్తి గత ఆస్తులు, వారి బినామీల ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. గత కొద్ది నెలలుగా కే–ట్యాక్స్‌తో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిన విషయం అందరికీ తెలుసన్నారు. గతంలో పని చేసిన కొంతమంది అధికారులు కందికుంట మోచేతి నీళ్లు తాగి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం నడిపారన్నారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూలు చేస్తున్నారు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కూటమి నేతలు


