పుట్టపర్తి: బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు పథకం నిర్వహణకు సరైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికుడు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా ఈ నెల 25నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జేసీ మౌర్యభరద్వాజ్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేసి, మాట్లాడారు. జిల్లాలో 550 మంది కార్మికులు జిల్లాలోని 15 లక్షల మంది జనాభాకు నీటి సరఫరా చేస్తున్నామన్నారు. గతంలోనూ సమ్మె చేస్తేనే జీతాలు చెల్లించారని గుర్తు చేశారు. ఆ తర్వాత మళ్లీ జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. దీంతో నాలుగు నెలలుగా జీతాలు అందక కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. తాగునీటి పథకం నిర్వహణకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం 5 నెలలకు సరిపడే నిధులు మాత్రమే కేటాయించడం సమంజసంగా లేదన్నారు. వాటర్ ప్రాజెక్టును జిల్లా పరిషత్ పరిధిలో విలీనం చేసి తమకు ఉపాధి భద్రత లేకుండా చేయడానికి సిద్ధమవుతున్నారని, ఇదే కనుక జరిగితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 25 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
తలుపుల: మండలంలోని కుటాగుళ్లకు చెందిన నరసింహులు (35) వడదెబ్బతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుటాగుళ్లకు చెందిన చెన్నమ్మ ఉడమలకుర్తి వద్ద మామిడి తోట తీసుకుని అక్కడే ఉంటోంది. ఆమెకు నలుగురు సంతానం కాగా, చిన్న కుమారుడు నరసింహులు ఈ నెల 11వ తేదీన తల్లి చెన్నమ్మ వద్దకు వచ్చాడు. 12వ తేదీ ఆదివారం ఉదయం కుటాగుళ్లకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. నడుచుకుంటూ వస్తున్న అతను ఎండ దెబ్బకు తాళలేకపోయాడు. వడదెబ్బకు గురై ఓదులపల్లి వద్ద కిందపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ గుర్రప్ప ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.


