మండే ఎండ.. మంటలతో జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

మండే ఎండ.. మంటలతో జాగ్రత్త!

Apr 14 2026 8:40 AM | Updated on Apr 14 2026 8:40 AM

పుట్టపర్తి టౌన్‌: భానుడి భగభగలతో జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం రామగిరిలో ఏకంగా 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదాలకూ అస్కారం ఎక్కువగా ఉంటోంది. అగ్ని ప్రమాదాల బారి నుంచి తమతోపాటు చుట్టుప్రక్కల వారినీ కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక శాఖ ఈనెల 14వ తేదీ (మంగళవారం) నుంచి ఈనెల 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తోంది.

జిల్లాలో ఆరు అగ్నిమాపక కార్యాలయాలు..

జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర తదితర ప్రాంతాల్లో ఆరు అగ్ని మాపక శాఖ కార్యాలయాలున్నాయి. మొత్తంగా ఆరుగురు ఫైర్‌ ఆఫీసర్లతో పాటు 115 మంది ఫైర్‌ ఫైటర్లు, 24మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. రోజురోజుకూ ఎండలు ముదిరిపోతున్న ప్రస్తుత తరుణంలో జిల్లాలో అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గడ్డివాములు, ఉద్యాన పంటలు, అటవీ ప్రాంతాలు దగ్ధమవుతున్నాయి. ఎంత అప్రమత్తంగా ఉన్నా... కొన్ని సమయాల్లో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా అగ్ని మాపకశాఖ కూడా నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి చర్యలు తీసుకోవడంతోపాటు అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను అవగాహన కల్పిస్తోంది.

పాటించాల్సిన నియమాలు..

చిన్న పిల్లల దగ్గర అగ్గిపెట్టెలు, లైటర్లు టపాకాయలు వంటి వాటిని ఉంచకూడదు. కాల్చిన సిగరెట్లు, బీడీలు అగ్గిపుల్లలు ఆర్పకుండా పాడేయకూడదు. ఐఎస్‌ఐ మార్క్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలే ఉపయోగించాలి. ఊళ్లకు వెళ్లే సమయంలో ఇంటి మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేస్తే ఉత్తమం. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆర్పడానికి నీటిని సిద్ధంగా ఉంచాలి. గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్‌ను ఆఫ్‌ చేయాలి. గోడౌన్లలో వస్తువులు స్టాక్‌ ఉంచేటప్పుడు వస్తువుల మధ్య ఖాళీ ప్రదేశం వదలాలి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్ని ప్రదేశాలు గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. విద్యుత్‌ ప్రమాదాలు జరిగినప్పుడు నీటిని ఉపయోగించకూడదు. మంటలను ఆర్పేందుకు పొడి ఇసుకను మాత్రమే వాడాలి. పెట్రోల్‌, గ్యాస్‌ నింపుకునేందుకు వెళ్లినప్పుడు వాహనాల ఇంజన్లను ఆఫ్‌ చేయాలి. పెట్రోలు బంకుల్లో సెల్‌ఫోన్లు వాడకూడదు.

నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు..

మంగళవాం నుంచి 20 తేదీ వరకు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు అమరవీరులకు నివాళి, 15న అగ్ని ప్రమాదాలపై బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు, 16న అపార్టుమెంట్లు, 17న విద్యాసంస్థలు, 18న గ్యాస్‌ గోడౌన్లు, ఆయిల్‌ ఫార్మ్‌లు, 19న ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటుు. 20న అన్ని వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

అవగాహనతోనే అగ్ని ప్రమాదాలకు చెక్‌

అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

గత ఏడాది అగ్నిప్రమాదాలు ఇలా..

ప్రమాదాలు

376

ఆస్తి నష్టం

రూ. 4,92,11,746

కాపాడిన సొమ్ము రూ.14,97,21,000

సిద్ధంగా ఉన్నాం

జిల్లాలో ఎలాంటి ప్రమాదం, విపత్తు సంభవించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్నవారితోనే ప్రమాద సమయంలో వెంటనే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు వెంటనే మాకు సమాచారం ఇస్తే నష్టం జరగకుండా చూస్తాం. అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి వారం రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తాం.

– మాధవ నాయుడు, జిల్లా అగ్నిమాపక

శాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement