జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు, పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
పుట్టపర్తి అర్బన్: ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న హిందూపురం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆచూకీ తెలిసిన వారు 94412 38182కు సమాచారం ఇవ్వాలని హిందూపురం రైల్వే పోలీసులు కోరారు.
ఊజీ మాత్రలు మింగి వ్యక్తి..
బత్తలపల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లికి చెందిన సాకే వెంకటప్ప(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంట్లో కుమారుడితో గొడవ పడి ధర్మవరం వెళ్లాడు. తిరిగి వస్తూ మల్లేనిపల్లి వద్ద ఊజీ మాత్రలు మింగి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బావ నరసింహుడుకు ఫోన్ చేసి తెలిపాడు. ఆయన సంఘటనాస్థలానికి చేరుకుని అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకటప్పను బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య చౌడేశ్వరితో ఇద్దరు కుమారులు ఉన్నారు.
బావిలో దూకి...
ముదిగుబ్బ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన షెక్షావలి (40)కు భార్య నసీమా, ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడేళ్లుగా ఆమె వేరు కాపురం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ముదిగుబ్బలోని బంధువులను కలిసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ముదిగుబ్బ శివారున ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ప్రేమ విఫలమై..?
పావగడ: స్థానిక పీఎస్ పరిధిలోని రొప్పం గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు జయ ప్రకాష్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రేమ విఫలమే ఇందుకు కారణంగా తెలిసింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు.


