హిందూపురం మోడల్ కాలనీకి చెందిన చాంద్‌బాషా టీ కేఫ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఏర్పడిన గ్యాస్ కొరతతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. బ్లాక్‌లో సిలిండర్ కొందామంటే రూ.3 వేలపైనే చెబుతుండడంతో అంతమొత్తం వెచ్చించలేక కేఫ్ బంద్ చేసుకుంటున్నాడు.
.. గ్యాస్ కొరతతో వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చాంద్‌బాషా లాంటి చిరువ్యాపారులు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ఇన్నాళ్లూ దర్జాగా బతికిన వారంతా ఇప్పుడు కుటుంబానికి మూడు పూటలా కడుపు నింపేందుకు సైతం పడరాని పాట్లు పడుతున్నారు.
హిందూపురం టౌన్/ పెనుకొండ: పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు చిరువ్యాపారుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అధికారులు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో టీ కేఫ్‌లు, చిన్నపాటి హోటల్ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కమర్షియల్ సిలిండర్లు దొరక్క హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ బంకులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను మూసివేశారు. ఇదే అదనుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టిస్తూ క్యాష్ చేసుకుంటున్నాయి. కమర్షియల్ సిలిండర్ల ధరలను విపరీతంగా పెంచేసి బ్లాక్‌లో విక్రయిస్తున్నాయి.
‘కమర్షియల్’ కష్టాలు
హోటళ్లు, టీస్టాల్స్, రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్లు దొరక్క నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా అంతంతమాత్రానే ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వండే చైనీస్ వంటకాలు పూర్తిగా గ్యాస్ పొయ్యిలపైనే చేయాల్సి ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో పలు చోట్ల ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు మూతబడ్డాయి. కొన్ని చోట్ల బ్లాక్‌లో సిలిండర్లను కొనుగోలు చేసి మరీ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.2,200– రూ.2,300 ఉండగా.. పలు ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలు రూ.4,500 వరకూ వసూలు చేస్తున్నాయి. ఇంతమొత్తం చెల్లించలేని కొందరు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
అన్నీ బంద్
కమర్షియల్ సిలిండర్ల కొరతతో పెనుకొండ మండలంలో పలు కేఫ్‌లు, హోటళ్లు మూతబడ్డాయి. కట్టెల పొయ్యితో హోటల్, కేఫ్ నిర్వహణ కష్టంగా మారడంతో చాలా మంది బంద్ చేశారు. గతంలో ఒక వెలుగు వెలిగిన హోటళ్లు, కేఫ్‌లు నిరవధికంగా మూతబడ్డాయి. వ్యాపారులు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కేఫ్‌లు, హోటళ్ల ఏర్పాటు కోసం బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు తీసుకుని నెలనెలా కంతులు చెల్లిస్తున్నారు. అలాంటి వారు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ‘కియా’ కార్ల పరిశ్రమ వద్ద సైతం కొన్ని కేఫ్‌లు మూతబడగా, హోటళ్లు భారంగా నడుస్తున్నాయి.
పొయ్యి వెలగక.. కడుపు నిండక
హోటళ్లు, చిరు వ్యాపారులపై
సిలిం‘డర్’ మోత
కొరతను సాకుగా చూపి
బ్లాక్‌లో విక్రయం
మార్కెట్‌లో ఒక్కో సిలిండర్
రూ.3 వేలపైనే
గ్యాస్ కొనలేక కేఫ్‌లు,
హోటళ్లు మూసేసిన వైనం
వ్యాపారం లేక పస్తులుంటున్న చిరువ్యాపారులు
వాణిజ్య సిలిండర్ల కొరత తీర్చాలి
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లను నిర్వహించలేకపోతున్నాం. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. సిలిండర్ దొరికిన రోజు హోటల్‌ను నిర్వహిస్తూ, మిగతా రోజుల్లో మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్లాక్‌లో కొందామంటే గ్యాస్ సిలిండర్ ధర భారీగా ఉంది. అధికారులు స్పందించి వాణిజ్య సిలిండర్ల కొరత తీర్చాలి.
– సాయి, హోటల్ నిర్వాహకుడు, హిందూపురం


