వైభవం.. పోతులరాజు మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. పోతులరాజు మహోత్సవం

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

రొళ్ల: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన చారిత్రక ప్రదేశం, శైవక్షేత్రంగా పేరొందిన రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ‘పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవం’ ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. మహాకాళి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. రాజవంశీకుల ఇంటి నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని గ్రామవీధుల గుండా నృత్య మాడుతూ మంగళవాయిద్యాల నడుమ కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాలబావి సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాన్ని తిలకించడానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహిళలు పాలబావిలో గంగా పూజ చేశారు. జాతరలో తినుబండారాల దుకాణాలు భక్తులతో కిటకిటలాడాయి. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బి.అనంతరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివప్రసాద్‌, మాజీ మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, నాయకుడు నగేష్‌రంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంజునాథ్‌, మాజీ వైస్‌ సర్పంచ్‌ సీఎం ఘట్ట రవి, నాయకులు యరగుంటప్ప, సురేష్‌, హనునాయక్‌లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ కె.నరసింహుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం (నేడు) పాల బావిలో గంగా పూజతో పాటు రాత్రికి పోతుల రాజు బండారు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement